Radha Krishna

Radha Krishna

Friday, July 18, 2014

చెరువుగట్టు

 




కాళ్ళేలాడేసుకుని కూర్చున్నాం చెరువుగట్టు మీద ఇద్దరం.

చక్కిలిగిలి పెడుతూ, వంకర్లు తిరుగుతూ తాకి వెళుతుంది నీరు.

 కనుచూపు మేర చక్కని చిక్కని మేఘాలు.

పక్కనే పైరు గాలి కూగుతూ మమ్మల్ని చూసి నవ్వింది.

చక్కిలిగిలి పెట్టాను. చిన్నగా సిగ్గు పడింది. తలవంచుకుంది.

ఆకాశం, భూమీ ముద్దెట్టుకున్నాయి నేచూస్తుండగానే........

భయంతో రెండు చేతుల్తో నన్ను కౌగలించుకుంది.

నీటి తరంగాలపై వంకర్లు తిరుగుతున్న మా ప్రతిబింబాలు....

Wednesday, July 2, 2014

అక్షరం




నా ఆలోచనలు అక్షరాలై బయటకు వచ్చేస్తామని భయపెడుతున్నాయ్.

తెల్లని కాగితాన్ని సిరాతో పాడుచేయాలనిపించదు.

నా మనసంత స్వచ్ఛంగా ఉంచాలనుకుంటాను.

ఏ అక్షరం ఏం మాయ చేస్తుందోననే భయం నాకు,

నేను పోయాకా అందర్నీ భూతాలై వెంటాడతయని.

Tuesday, July 1, 2014

మా సుబ్బయ్యగారింట్లో దొంగలు పడ్డారు.

మా సుబ్బయ్యగారింట్లో దొంగలు పడ్డారు.

ఓ పక్కగా తెల్లారిందో లేదో ఈ వార్త వినగానే ఉలిక్కిపడ్డారు పెద్దోళ్ళంతా.
పొద్దున్నే ఊడ్చి, కళ్ళాపి జల్లి, పొయ్యిలెలిగించే ఆడాళ్ళయితే, జుట్టుముడి ఊడిపోయినా పట్టించుకోకుండా ఓ గుంపుగా చేరిపోయి ఆ గొడవే మాట్లాడేసుకుంటున్నారు. “అయ్యో పాపం ఇరవైతులాల బంగారం, నలభై వేలరూపాయల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇంకా ఏం ఎత్తుకుపోయారోనమ్మా సచ్చినోళ్ళు” “సుబ్బయ్యగారు బాగానే సంపాదించాడులే, పార్వతమ్మ ఓ వెలుగు వెలిగింది. అంతా పోయే ఉంటాది.” “పోతేపోయింది రేపట్నుండి మనల్ని అప్పులడగకుండా ఉంటే నయ్యం అంటూ మూతులు తిప్పుకుంటా, మనకెందుకొచ్చిన గొడవలే అంటా సాగదీసుకుంటున్నారు.
 ఇక మగాళ్ళయితే పంచలెగ్గట్టి ఒకరితరువాత ఒకరు రచ్చబండ మీద మీటింగులెట్టేత్నారు. “పాపం సుబ్బయ్యగారు ఎంత దజ్జాగా ఉండేవోడు. యాభై తులాల బంగారం, లక్షరూపాల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇకపోయిన సొమ్ముతోనే ఆయన దజ్జాకూడా పోయినట్టేరా ఎంత కష్టం వచ్చింది ఆ కుటుంబానికి అనుకుంటూ తెచ్చిపెట్టుకున్న బాధతో తెగ జాలిపడిపోతున్నారు.
తెల్లారినంతనే ఏదో ఉపద్రవం వచ్చిపడిపోయి ఆరోజు బడి ఎగ్గొట్టేయాలని రాత్రే దేవుడికి తెగ దండాలెట్టేసి పడుకున్న నాలాటోడికి, ఏ ప్లాన్లు గీయకుండానే పాచిక పారినట్టయింది. ఈ వార్త మా పాలిటి ఓ కులాసా కబురే అయింది. ఏదో అర్జంటు రౌండు టేబుల్ సమావేశమున్నట్టు పిలకాయలంతా కూడా మా చిన్నగాడింటి ముందున్న గానుగచెట్టుకింద కలిసేసుకుని మాలో మేమే తెగ మల్లగుల్లాలు పడిపోతున్నాం. ఎక్కడా పెద్దోళ్ళకు తీసిపోకూడదని.
పాపంరా చిట్టి రోజుకో మంచి పావడా కట్టుకొచ్చేదల్లా ఈకాడ్నించీ సినిమాలో చూపించినట్టు పాచ్చీలేసిన డ్రెస్సులు కట్టుకొస్తుందా ఏం”.
సుబ్బయ్యగారి మనవరాలు చిట్టి (చారులత) మాతోడిదే. పక్కనున్న బడిలో నా తరగతిలోనే ఆరు చదువుతుంది. మంచి తెలివైన పిల్లలే. “పాపం ఎంత కష్టం వచ్చిందో కదా పలకరించి రావాలి అన్నాను. మా చిన్నాగాడు నా మాటకడ్డొచ్చి చాల్లే పాపం దేశం మీద నీ ఒక్కడికే వుందిమరి జాలి. అసలు మీకు తెలుసా ఇప్పుడేం జరుగుతాదో, మా నాన్న చెప్పాడు ఇప్పుడు వాళ్ళింటికి పోలీసోళ్ళొత్తారంటా అక్కడ ఉన్నవాళ్ళల్లో అనుమాన మొచ్చిన ప్రతీ వాడినీ జీపులో ఏసుకుపోతారంట తెలుసా వద్దు ఎవరూ ఎల్లకండిఅన్నాడు. నిజమే అని మాలో ఎవరం ఎల్లకూడదని ఓ తీర్మానం చేసుకున్నాం.
భోజనాల వేళకి ఈ కబురు మా పాలకొల్లు పెదబ్రిజ్జీ దాకా పాకిపోయింది.
రోజూ బడికి రాగానే తను తినడానికి ఏ మిఠాయి తెచ్చుకున్నా నాకు పెడుతుంది చిట్టి, అలాటిది తనకి ఇంత కష్టం వస్తే నేను మిన్నకుండిపోయానా పాపం కదూ ఎలాగైనా ఎల్లాలి అనుకున్నాను. ఇక ఆలస్యం చేయకూడదని నేను మా పెరడెనక సందులోనుండీ సుబ్బయ్యగారింటికి బయలుదేరిఎల్లాను. మా చిట్టి వాళ్ళిల్లు మా అందరిళ్ళ మాదిరిగా పాక కాదు పెద్ద డాబా ఇల్లు. కొట్టచ్చినట్టు కనబడేది మా వీధిలోకే ఆ ఇల్లు. “ఇలా గుంటే మరి పడరా దొంగోళ్ళుఅనుకున్నాను మనసులో.
నేనెళ్ళే సరికి ప్రెసిడెంటు రాయుడుగారు పదిమంది నేసుకుని అప్పటికే సుబ్బయ్యగారింటికి బయలుదేరిపోయాడు. ఆళ్ళు ఇంట్లో కెళ్ళకుండా కాస్త దూరంగా మాటాడుకుంటున్నారు. “ఇప్పటిదాకా కూడబెట్టిందంతా పోయిందంటా! పాపం ఏం వత్తాడు బైటకు. ఎవరో ఆనూపానూ చూసుకునే చేసారీ దారుణం. ఈ రోజు ఈ ఇల్లయింది రేపు మన ఇల్లుకాదనేంటి గేరంటీ. అయినా డబ్బున్నాదికదా అని మరీ అంత డాబుసరికి పోకూడదు. కాస్త అణిగీ మణిగీ ఉండాలి. మరీ అంత మిడిసిపడితే ఇదిగో ఇలాగే ఉంటాయి పరియవసానాలు. తెలిసిందా”... ఇదీ పెసిడెంటుగారి మీటింగు సారాంశం.
ఆ మాటలు నన్ను మరింత కంగారు పెట్టేసాయి ఓ పరుగందుకుని చొరవగా లోపలికెళ్ళాను చిట్టికోసం.
ఇంట్లో పెద్దోళ్ళంతా చాలా కంగారుగా దేనికోసమో వెతుకులాడుతున్నారు. అప్పుడే లేచింది కాదోలు చిట్టి ఇంకా మత్తుగానే ఉంది చూపు. “ఏం చిట్టి ఏం జరిగింది అన్నానో లేదో పెద్దగా ఏడుపు లంకించుకుంటూ సోఫాలో కూచుండిపోయింది.
పాపం అంతా పోయిందని ఏడుస్తుంది. నిజంగా చానా కష్టమొచ్చింది మా చిట్టికిఅనుకున్నాను మనసులో. దగ్గిరికెళ్ళి పక్కన కూచుని బాధపడకు చిట్టీఅన్నాను.
కానీ ఎక్కిళ్ళు ఎక్కిళ్ళుగా ఏడ్చేస్తుంది. ఎక్కిళ్ళ మధ్య ఆపుకుంటూ చెప్పిందినిన్నే పెరళ్ళో మట్టి కలుపుకుని ఎంతో బాగా చేసుకున్నాను. కిరీటం మురళీని. అచ్చం ఎంత బాగా వచ్చాయో తెలుసా. బంగార్రంగు సిగరెట్టు కాయితం అంటించి రోజంతా మేడ మీద ఎండబెట్టుకున్నాను. అక్కడే ఉంచేసినా పోయేది. అమ్మకి చెప్పి ఆ డబ్బులపెట్లో దాయమని ఇచ్చాను. దొంగెదవలు నా బంగారం ఎత్తుకుపోయారు.” అని బోరున అందుకుంది.
ఇంట్లో వాళ్ళు చిట్టి వైపు అదోలా చూస్తూండిపోయారు. ఆళ్ళ ముందు చిట్టిని ఓదారిస్తే నన్ను పట్టుకు కొడతారనిపించి నోర్మూసుకుండిపోయాను.


Tuesday, May 27, 2014

                                                             నా ప్రేమకు రూపం నువ్వే


                                     

ఎంత నిర్దయ నీకు నా మీద

ఈ రాత్రి నువ్వు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని శూన్యం చేస్తుంది.

నీ చుట్టూ కట్టుకున్న నా ఇంటిని వేర్లతో పెకిలించుకుపోతావా

నువ్వు లేవని తెలిసిన నాడు నాకు ఈ ప్రపంచంతో బంధం తెగిపోతుంది.

నా కన్నీళ్ళ ను ఆనకట్టగా వేసి పొంగుకొస్తున్న నీ ఆవేశాన్ని ఆపాలనిలేదు.

ప్రేమను తెలియపరచడానికి సాధనాలు కనిపెట్టి ఉంటే మొదటి స్థానం నాదే.

నువ్వు లేవని, ఎప్పటికి రావని తెలిసిన నాడు ఊపిరి తీస్తున్న కళేబరాన్నై మిగులుతాను.

నీ పలకరింపుతోనే కదా నా రోజు మొదలయేది,

నిన్నుబలవంతంగా కాదు నా ప్రేమతో కట్టి పడేయాలని ఉంది.

Saturday, April 19, 2014

అసలు నువ్వెవరు







ఈ మధ్య నా మనసు చిత్రమైన సవ్వడి చేస్తుంది.

విరగబూసిన మందారాలు తమ యవ్వన బరువులు తాళలేక సన్నగా పుప్పొడిని

వదులుతున్నాయట...

ఓ ప్రక్కగా పడివున్న రాళ్ళు తమ స్వభావాన్ని విడిచి నదిహోరుకు తమలో రేగిన

తాపాన్ని వెళ్ళబోసుకున్నాయట చేపలతో...

వాన వస్తుందని ఊరించి, ఉత్సాహపరిచి, నిరాశ పరిచాయి మేఘాలు....

దట్టమైన చీకటిని చీల్చుతూ దారి చూపుతామని ప్రతిన బూనాయి మినుగురులు.

నీతో నా అందమైన జీవితం ఎన్ని రంగులద్దుకుంటుందో తన రూపుతో తెలియ

పరిచింది ఇంద్రధనస్సు...

నీవు వస్తావని బలమైన నీ బిగికౌగిలిలో నన్ను బంధీని చేస్తావని గుమ్మంలో నా

ఎదురుచూపులు......

అసలు ఎవరు నువ్వు నాకు గురుతేలేదే....

క్షణకాలమైనా లేదే మన పరిచయం అసలు నువ్వెవరు..........

Tuesday, April 8, 2014

నన్ను పలకరించిన ఉదయం






రెండు రోజులుగా ఉదయపు నడకను మొదలు పెట్టాను. నిద్రలేచేసరికి గుర్రుపెడుతున్న ఆయన. రాత్రంతా మెలకువగా ఉండి అప్పుడే పడుకుంటున్న బాబు.

మనసుకు, శరీరానికి ఇష్టం లేకపోయినా ఎలాగైనా ఉబకాయన్ని తగ్గించుకోవాలనే నా పట్టుదలముందు మనసుపోయే గారాలు నిలవలేదు.

ఉదయం నిద్ర లేచేసరికి 5నుండి6 గంటల మధ్యలో ఉండే వాతావరణం అంటే నాకు మహా ఇష్టం. ఆ గాలిలో పసిపాప నవ్వు వినిపిస్తుంది నాకు.

నా తోటి వారంతా నిద్రావస్తలో ఉంటే నాకు మాత్రం ఏ కాలుష్యమూ లేని ఆ గాలిని పూల్చుకోవడం ఇష్టం.

నాతోపాటే నిద్రలేచి పనికి వచ్చితనరాక మనకు తెలియాలని లేలేత కిరణాలతో శుభోదయం చెపుతున్న సూర్యుడు నా ప్రియస్నేహితుడిగా పలకరిస్తాడు.

ఇంటికి కాస్త దూరంలో ఉన్న పార్కునే అడ్డాగా చేసుకుని నడకను మొదలు పెట్టాను. ఉదయాన్నే ఇంటి నుండీ బయలుదేరేసరికి  అప్పుడే లేచి నిద్ర మొహాలతో కళ్ళాపు జల్లుతున్న నాతోటి ఆడవాళ్ళు నన్ను మొదటగా పలకరిస్తారు.

ఆ తరువాత వాకిట్లో ముగ్గులు, బజ్జీల బండిలో వెలిగించిన అగరబత్తీల వాసన, నేను వెళ్ళే దారిలోనే ఉన్న రామాలయం నుండి సన్నగా వినిపిస్తున్న భక్తి పాటలు, పార్కులో ఆడుకునే చిన్న పిల్లలు, పేపరు చదువుకునే పెద్దవారు, ఈరోజే తగ్గిపోతామన్నంతగా కొంపలు మునిగిపోయేలా నడిచే తోటి ఊబకాయులు.

అలసిపోయి ఇంటికి తిరుగు ముఖం పట్టాకా శరీరంలో అన్ని అవయవాలూ అలసిమూలుగుతున్నా, నా నాసిక మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది.

ప్రతీ ఇంటి నుండీ కమ్మగా గాలితో సమంగా వ్యాపించిన రకరకాల పలహారాల వాసనలు నా జిహ్వచాపల్యానికి పెట్టే కఠోర పరీక్షగా అనిపిస్తుంది.

ఈ ఉదయాన్నే నన్ను మొదటగా పలకరించిన మలయమారుతం నా మెదడు పొరల్లో ఎక్కడో మరుగున పడిపోయిన జ్ఞాపకాలను చిన్న పలకరింపుతో నిద్రలేపింది.

నేను ఇంటికి వచ్చే సరికి అమాయకంగా పలకరించే నా ఇంటి గుమ్మం, ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళావమ్మా అంటూ పక్కవాళ్ళ వేసే పిచ్చి ప్రశ్నలు. ఇంటిలోనికి రాగానే మళ్ళీ అదే నిశ్సబ్దం.


మా సీతారాముల కళ్యాణం చూదము రారండి.




ఎంత మనోహరంగా ఉంది ఈ వాతావరణం. దాదాపుగా మా ఇంటి నుండీ వంద అడుగుల్లో ఉంది, ఆంజనేయ స్వామి రాతి కొండలో స్వయంభూవుగా వెలిసాడు. అక్కడే దేవాలయం కట్టారు. చుట్టూ ఇళ్ళు ఉన్నా దేవాలయం మాత్రం ఇరుకుగా ఉండదు. విశాలంగా ఓ వెయ్యి గజాలలో నిర్మించారు. ఈ గుడిలో ఇంకా చాలా దేవుళ్ళే ఉన్నారు. ఓ ప్రక్కగా సీతారాములు, శివుడు, దుర్గాదేవి, పెద్దనాగ పడగతో సుబ్రమణ్య స్వామి, నవగ్రహాలు ఉన్నాయి. గుడిలోనే రావీ, వేపా కలిసి మహా వృక్షంగా పెరిగింది. తమ తమ కష్టాలను కాసేపు దేవుడికి విన్నవించుకుంటూనే ఈ ఆహ్లాద కరమైన వాతావరణాన్ని ఆస్వాదించనూవచ్చు.

ఎన్నో ఏళ్ళుగా అలవాటు పడిన వాతావరణమది. సరిగ్గా పది సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే , నేను శ్రీ రామనవమికి రాములవారి కళ్యాణం ప్రతీ సంవత్సరం చూస్తాను. ఈరోజు శ్రీ రామనవమి అందుకే ఉదయాన్నే పూలుతీసుకుని గుడికి వెళ్ళాను, అప్పటికే స్వామివారిని పెళ్ళికొడుకుగా, సీతమ్మవారిని పెళ్ళికూతురుగా ముస్తాబు చేస్తున్నారు. గుడంతా రంగురంగుల రంగవల్లులతో , పూలదండలతో అలంకరించి ఉంది. సరిగ్గా ఉదయం 11.30కి ముహుర్తం అన్నారు పంతులుగారు.

పూలు ఇచ్చి పార్కులోకి వెళ్ళాకా సన్నగా రాముని పాటలు వినిపిస్తున్నాయి. నడుస్తూ ఆ పాటలు వింటున్ననాకు గడిచిన ఏళ్ళు ఒక్కసారిగా పలకరించి ఆ జ్ఞాపకాల అలల తాకిడి తీవ్రతను ఆస్వాదిస్తూ, ఇంటికి వచ్చి పడ్డాను.

ఇంటికి చేరుకున్నాకా నేను ఈ రోజు పండగంటూ మనసులో పడిపోతున్న హడావుడంతటికీ తెర పడినట్టుగా ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఏ సడీ లేకుండా పరమ బోరు కొడుతూ ఉంది. నేను పైకి ఏం అనలేదు కానీ మనసులో మాత్రం నా వాళ్ళంతా ఇంత నాస్తికులైపోయారా అనిపించింది. ఇంట్లోనే కాదు మా వీధిలోనే ఏ సందడీ లేదు. అందరికీ రాముడు గురుతులేడుకానీ, శ్రీరామనవమి కదా ఇచ్చిన సెలవుకు ముసుగు తన్ని పడుకోవడం గురుతుంది. నాకు అందరిమీదా కాస్త చిరాకూ, కోపం వరసగా వచ్చేసాయి.

ఇక ఎదురింట్లో అడిగి తెచ్చిన మావిడాకులు గుమ్మానికి అలంకరించి, పడుకున్న ఆయన్ని గుడికి వెళదామని నిద్రలేపాను. షరా మామూలే నేను రాలేను నువ్వు వెళ్ళు అని. అప్పటి వరకూ మేము ఇద్దరం ఒకటి మా అభిప్రాయాలూ ఒకటే అనుకున్న నాకు చుక్కెదురైంది.

అప్పటికే 11గంటలు కావస్తుంది. తలారా స్నానం కానిచ్చి తయారై దేవుడికి దీపారాధన చేసి కొబ్బరికాయ తీసుకుని బయలుదేరాను గుడికి. నేను వెళ్ళే సరికి స్వామివారికి, అమ్మవారికీ కంకణ ధారణ అయింది. అప్పటికి పెద్దగా జనంలేరు.

అదేమిటి 11.30 ముహుర్తం అన్నారుకదా అన్నాను నా పక్కన నుంచున్నఆమెతో “ఎమోనమ్మ చోద్యం ఇప్పుడు 1.30 పైనే అయ్యింది. నేను టీవీలో భద్రాద్రిలో రాములవారి కళ్యాణం చూసే వస్తున్నా, ఇక్కడ చూస్తే ఇంకా కంకణాల దగ్గరే ఉంది”.అంది.

నాకు ఆ మాటలేం వినిపించడం లేదు ఏదో పుణ్యం చేసి వైకుంఠానికి వచ్చానా అక్కడే రాములవారు నా ముందుగా సీతా సమేతంగా కూర్చుని కళ్యాణం చేసుకుంటున్నాడా అన్నట్టు ఊహలో కాసేపు ముగ్దురాలినై చూస్తుండిపోయాను.

చాలా మంది వచ్చారు కళ్యాణం చూడడానికి. మంగళ వాయిద్యాలు మోగుతున్నంత సేపూ నా కళ్ళల్లో చిన్నగా నీటి పొర.

సీతమ్మ రాములోరి పక్కన సిగ్గు పడుతూ తల వంచుకుని క్రీగంట రాముడిని దొంగచూపులు చూస్తున్నది అక్కడి వారు ఆ విషయం గమనించకున్నా, ఆ అరుదైన దృశ్యం నా కళ్ళల్లో పడకపోలేదు. ఎంత చిత్రం ఇన్ని సార్లు పెళ్ళి చేసుకున్నా ఇంకా ఆ బెరుకెందుకు ఇదేమి సరసమమ్మా, అని అడగాలనిపించింది. పెళ్ళి ఘనంగా జరిగింది. ఆ జంటను అలాగే నా మనసులో ముద్ర వేసుకున్నాను.

కళ్యాణం కావస్తూ ఉండగానే అందరిలోనూ ఒకటే కంగారు ఎప్పుడు ఇంటికి పోదామా అని, లేదంటే భోజనాలు తిని బయలు దేరాలని కాబోసు, చిన్న పిల్లలతో వచ్చిన వారి సంగతే చాలా దారుణంగా ఉంది ఒకటే తోపులాట.

నా కళ్లు మాత్రం అవేమి ఆశించడం లేదు. నేను ప్రతీ రామనవమికీ తలంబ్రాల బియ్యం వరకూ ఆగి అవి తీసుకు మరీ వెళతాను. ఈ రోజూ అలాగే అందరితో తోసుకుంటూ కాక కాస్త ఆగి వెళ్ళాను. అక్షింతలు వేసి, తలంబ్రాలు అడిగి తీసుకున్నాను. అప్పటికి ఏదో తృప్తితో కడుపంతా నిండిపోయింది.

కానీ ఏదో వెలితి ఎవరికీ సరిగా పానకం అందలేదు, వడపప్పు అసలు లేనే లేదు. అందరినీ భోజనాలు చేసి మరీ వెళ్ళమన్నారు. నాకు ఆ విషయం ఎందుకో రుచించదు. మనం తినే ఆ భోజనం ఓ బీదవానికి వస్తుందికదా అనే అభిప్రాయం నా మనసులో బలంగా నాటుకు పోయింది.

ఇలా రంగరంగ వైభవంగా భద్రాద్రి కళ్యాణంతో సమానంగా ఇక్కడా రాముడు సీతమ్మ చేయందుకున్నాడు.

Saturday, March 22, 2014

మనుగడ కోసం నా ప్రయత్నం






ఓ మనిషిగా ఈ ప్రపంచంలో పుట్టిన నేను. అందరిలాగే పెరిగాను పెద్దయ్యాను. కానీ నేను అందరిలాంటి వ్యక్తిని కానని నా ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రపంచంతో సంబంధం లేని ఏదో లోకంలో పుట్టి,  పెరిగి హఠాత్తుగా  ఏ అర్ధరాత్రో ఈ భూమ్మీదకు వచ్చి పడలేదు కదా.

అప్పుడప్పుడు నాకు కలిగే అనుమానం అదే. మనిషన్న ప్రతీ వాడికీ ఓ లక్ష్యం ఉంటుందని అలాగే నాకు ఉండాలని ఏరోజూ అనుకోలేదు. ఒక్కసారిగా వచ్చిపడ్డాను. ఈ ఆదునిక ప్రపంచంలోకి. ఏదీ నా గమ్యం. ఎందుకు నేను ఈ సమాజంతో పాటూ సంచరించలేక పోతున్నాను. నాకు మానసిక వైఫల్యం లేదు కదా. నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాకదా. నాకు అందరిలా కమ్మని కలలు రావు. ఏదో తెలియని ప్రదేశంలో సంచరిస్తాయి నా ఆలోచనలు ఎప్పుడూ. నాకు నేను ఉన్నానని ఓ చిన్న సంకేతం కూడా ఇవ్వదు ఏ అభయ హస్తమూ నాకు. మరి నా ఈ పరిస్థితి కారణం ఏమిటి.

ఎక్కడకు వెళ్ళినా, ఏ పని చేసినా, ఎలాంటి వాతావరణాన్ని చూసినా, కొద్దిగా వింత గొలిపే ఏ వస్తువుని చూసినా, నాకు కలిగే ఆశ్చర్యం, నా అమాయకత్వపు ప్రశ్నలు నా తోటి వారికి ఏమని పిస్తాయి. వారు నా గురించి ఎలా ఆలోచిస్తారు. కమ్మని కలలు, దేశ చరిత్ర, జాతులు,  మతాలు, కులాలు , కంప్వూటరు, పుస్తకాలు, పాటలు, సినిమాలు, ఆటలు, అల్లర్లు, ఇంకా ఇంకా అన్నీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించేవే, నన్ను భయపెట్టేవే.

ఎవరు నువ్వు అంటే తడుముకోకుండా సమాధానం చెప్పగల రోజు ఎప్పుడు వస్తుంది. కాలంతో పోటీ పడి సాధించాలని ఉంది నా గుర్తింపుని. గడియ గడియకూ కరిగిపోతున్న కాలాన్ని కాస్త ఆగమని అడగనా నేనూ నీతో వస్తానని. నాకు తెలిసిన నేను పెరిగిన ప్రదేశాలే నా ప్రపంచంగా మలుచుకు బ్రతుకుతున్నాను నేను. నిజానికి నాకు ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియదు. తెలుసుకోవాలి. తెలుసుకుంటాను.

మనిషి ఆయుష్షు అరవై ఏళ్ళు అయితే నాకు ఇంకా సమయం ఉందనే అనుకుంటున్నాను. తెలుసుకోవడానికి. నేర్చుకోవడానికి.











Sunday, March 2, 2014

అందరికీ నమస్కారమండీ.


కొత్తగా ఈ బ్లాగు ప్రపంచంలోనికి అడుగుపెడుతున్నానండీ. నాకు డైరీ వ్రాయడం తప్ప ఎప్పుడూ రాసిన అనుభవం

లేదు. మీరంతా నా రాతలను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.