Radha Krishna

Radha Krishna

Tuesday, April 8, 2014

నన్ను పలకరించిన ఉదయం






రెండు రోజులుగా ఉదయపు నడకను మొదలు పెట్టాను. నిద్రలేచేసరికి గుర్రుపెడుతున్న ఆయన. రాత్రంతా మెలకువగా ఉండి అప్పుడే పడుకుంటున్న బాబు.

మనసుకు, శరీరానికి ఇష్టం లేకపోయినా ఎలాగైనా ఉబకాయన్ని తగ్గించుకోవాలనే నా పట్టుదలముందు మనసుపోయే గారాలు నిలవలేదు.

ఉదయం నిద్ర లేచేసరికి 5నుండి6 గంటల మధ్యలో ఉండే వాతావరణం అంటే నాకు మహా ఇష్టం. ఆ గాలిలో పసిపాప నవ్వు వినిపిస్తుంది నాకు.

నా తోటి వారంతా నిద్రావస్తలో ఉంటే నాకు మాత్రం ఏ కాలుష్యమూ లేని ఆ గాలిని పూల్చుకోవడం ఇష్టం.

నాతోపాటే నిద్రలేచి పనికి వచ్చితనరాక మనకు తెలియాలని లేలేత కిరణాలతో శుభోదయం చెపుతున్న సూర్యుడు నా ప్రియస్నేహితుడిగా పలకరిస్తాడు.

ఇంటికి కాస్త దూరంలో ఉన్న పార్కునే అడ్డాగా చేసుకుని నడకను మొదలు పెట్టాను. ఉదయాన్నే ఇంటి నుండీ బయలుదేరేసరికి  అప్పుడే లేచి నిద్ర మొహాలతో కళ్ళాపు జల్లుతున్న నాతోటి ఆడవాళ్ళు నన్ను మొదటగా పలకరిస్తారు.

ఆ తరువాత వాకిట్లో ముగ్గులు, బజ్జీల బండిలో వెలిగించిన అగరబత్తీల వాసన, నేను వెళ్ళే దారిలోనే ఉన్న రామాలయం నుండి సన్నగా వినిపిస్తున్న భక్తి పాటలు, పార్కులో ఆడుకునే చిన్న పిల్లలు, పేపరు చదువుకునే పెద్దవారు, ఈరోజే తగ్గిపోతామన్నంతగా కొంపలు మునిగిపోయేలా నడిచే తోటి ఊబకాయులు.

అలసిపోయి ఇంటికి తిరుగు ముఖం పట్టాకా శరీరంలో అన్ని అవయవాలూ అలసిమూలుగుతున్నా, నా నాసిక మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది.

ప్రతీ ఇంటి నుండీ కమ్మగా గాలితో సమంగా వ్యాపించిన రకరకాల పలహారాల వాసనలు నా జిహ్వచాపల్యానికి పెట్టే కఠోర పరీక్షగా అనిపిస్తుంది.

ఈ ఉదయాన్నే నన్ను మొదటగా పలకరించిన మలయమారుతం నా మెదడు పొరల్లో ఎక్కడో మరుగున పడిపోయిన జ్ఞాపకాలను చిన్న పలకరింపుతో నిద్రలేపింది.

నేను ఇంటికి వచ్చే సరికి అమాయకంగా పలకరించే నా ఇంటి గుమ్మం, ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళావమ్మా అంటూ పక్కవాళ్ళ వేసే పిచ్చి ప్రశ్నలు. ఇంటిలోనికి రాగానే మళ్ళీ అదే నిశ్సబ్దం.


1 comment: