Radha Krishna

Radha Krishna

Saturday, April 19, 2014

అసలు నువ్వెవరు







ఈ మధ్య నా మనసు చిత్రమైన సవ్వడి చేస్తుంది.

విరగబూసిన మందారాలు తమ యవ్వన బరువులు తాళలేక సన్నగా పుప్పొడిని

వదులుతున్నాయట...

ఓ ప్రక్కగా పడివున్న రాళ్ళు తమ స్వభావాన్ని విడిచి నదిహోరుకు తమలో రేగిన

తాపాన్ని వెళ్ళబోసుకున్నాయట చేపలతో...

వాన వస్తుందని ఊరించి, ఉత్సాహపరిచి, నిరాశ పరిచాయి మేఘాలు....

దట్టమైన చీకటిని చీల్చుతూ దారి చూపుతామని ప్రతిన బూనాయి మినుగురులు.

నీతో నా అందమైన జీవితం ఎన్ని రంగులద్దుకుంటుందో తన రూపుతో తెలియ

పరిచింది ఇంద్రధనస్సు...

నీవు వస్తావని బలమైన నీ బిగికౌగిలిలో నన్ను బంధీని చేస్తావని గుమ్మంలో నా

ఎదురుచూపులు......

అసలు ఎవరు నువ్వు నాకు గురుతేలేదే....

క్షణకాలమైనా లేదే మన పరిచయం అసలు నువ్వెవరు..........

Tuesday, April 8, 2014

నన్ను పలకరించిన ఉదయం






రెండు రోజులుగా ఉదయపు నడకను మొదలు పెట్టాను. నిద్రలేచేసరికి గుర్రుపెడుతున్న ఆయన. రాత్రంతా మెలకువగా ఉండి అప్పుడే పడుకుంటున్న బాబు.

మనసుకు, శరీరానికి ఇష్టం లేకపోయినా ఎలాగైనా ఉబకాయన్ని తగ్గించుకోవాలనే నా పట్టుదలముందు మనసుపోయే గారాలు నిలవలేదు.

ఉదయం నిద్ర లేచేసరికి 5నుండి6 గంటల మధ్యలో ఉండే వాతావరణం అంటే నాకు మహా ఇష్టం. ఆ గాలిలో పసిపాప నవ్వు వినిపిస్తుంది నాకు.

నా తోటి వారంతా నిద్రావస్తలో ఉంటే నాకు మాత్రం ఏ కాలుష్యమూ లేని ఆ గాలిని పూల్చుకోవడం ఇష్టం.

నాతోపాటే నిద్రలేచి పనికి వచ్చితనరాక మనకు తెలియాలని లేలేత కిరణాలతో శుభోదయం చెపుతున్న సూర్యుడు నా ప్రియస్నేహితుడిగా పలకరిస్తాడు.

ఇంటికి కాస్త దూరంలో ఉన్న పార్కునే అడ్డాగా చేసుకుని నడకను మొదలు పెట్టాను. ఉదయాన్నే ఇంటి నుండీ బయలుదేరేసరికి  అప్పుడే లేచి నిద్ర మొహాలతో కళ్ళాపు జల్లుతున్న నాతోటి ఆడవాళ్ళు నన్ను మొదటగా పలకరిస్తారు.

ఆ తరువాత వాకిట్లో ముగ్గులు, బజ్జీల బండిలో వెలిగించిన అగరబత్తీల వాసన, నేను వెళ్ళే దారిలోనే ఉన్న రామాలయం నుండి సన్నగా వినిపిస్తున్న భక్తి పాటలు, పార్కులో ఆడుకునే చిన్న పిల్లలు, పేపరు చదువుకునే పెద్దవారు, ఈరోజే తగ్గిపోతామన్నంతగా కొంపలు మునిగిపోయేలా నడిచే తోటి ఊబకాయులు.

అలసిపోయి ఇంటికి తిరుగు ముఖం పట్టాకా శరీరంలో అన్ని అవయవాలూ అలసిమూలుగుతున్నా, నా నాసిక మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది.

ప్రతీ ఇంటి నుండీ కమ్మగా గాలితో సమంగా వ్యాపించిన రకరకాల పలహారాల వాసనలు నా జిహ్వచాపల్యానికి పెట్టే కఠోర పరీక్షగా అనిపిస్తుంది.

ఈ ఉదయాన్నే నన్ను మొదటగా పలకరించిన మలయమారుతం నా మెదడు పొరల్లో ఎక్కడో మరుగున పడిపోయిన జ్ఞాపకాలను చిన్న పలకరింపుతో నిద్రలేపింది.

నేను ఇంటికి వచ్చే సరికి అమాయకంగా పలకరించే నా ఇంటి గుమ్మం, ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళావమ్మా అంటూ పక్కవాళ్ళ వేసే పిచ్చి ప్రశ్నలు. ఇంటిలోనికి రాగానే మళ్ళీ అదే నిశ్సబ్దం.


మా సీతారాముల కళ్యాణం చూదము రారండి.




ఎంత మనోహరంగా ఉంది ఈ వాతావరణం. దాదాపుగా మా ఇంటి నుండీ వంద అడుగుల్లో ఉంది, ఆంజనేయ స్వామి రాతి కొండలో స్వయంభూవుగా వెలిసాడు. అక్కడే దేవాలయం కట్టారు. చుట్టూ ఇళ్ళు ఉన్నా దేవాలయం మాత్రం ఇరుకుగా ఉండదు. విశాలంగా ఓ వెయ్యి గజాలలో నిర్మించారు. ఈ గుడిలో ఇంకా చాలా దేవుళ్ళే ఉన్నారు. ఓ ప్రక్కగా సీతారాములు, శివుడు, దుర్గాదేవి, పెద్దనాగ పడగతో సుబ్రమణ్య స్వామి, నవగ్రహాలు ఉన్నాయి. గుడిలోనే రావీ, వేపా కలిసి మహా వృక్షంగా పెరిగింది. తమ తమ కష్టాలను కాసేపు దేవుడికి విన్నవించుకుంటూనే ఈ ఆహ్లాద కరమైన వాతావరణాన్ని ఆస్వాదించనూవచ్చు.

ఎన్నో ఏళ్ళుగా అలవాటు పడిన వాతావరణమది. సరిగ్గా పది సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే , నేను శ్రీ రామనవమికి రాములవారి కళ్యాణం ప్రతీ సంవత్సరం చూస్తాను. ఈరోజు శ్రీ రామనవమి అందుకే ఉదయాన్నే పూలుతీసుకుని గుడికి వెళ్ళాను, అప్పటికే స్వామివారిని పెళ్ళికొడుకుగా, సీతమ్మవారిని పెళ్ళికూతురుగా ముస్తాబు చేస్తున్నారు. గుడంతా రంగురంగుల రంగవల్లులతో , పూలదండలతో అలంకరించి ఉంది. సరిగ్గా ఉదయం 11.30కి ముహుర్తం అన్నారు పంతులుగారు.

పూలు ఇచ్చి పార్కులోకి వెళ్ళాకా సన్నగా రాముని పాటలు వినిపిస్తున్నాయి. నడుస్తూ ఆ పాటలు వింటున్ననాకు గడిచిన ఏళ్ళు ఒక్కసారిగా పలకరించి ఆ జ్ఞాపకాల అలల తాకిడి తీవ్రతను ఆస్వాదిస్తూ, ఇంటికి వచ్చి పడ్డాను.

ఇంటికి చేరుకున్నాకా నేను ఈ రోజు పండగంటూ మనసులో పడిపోతున్న హడావుడంతటికీ తెర పడినట్టుగా ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఏ సడీ లేకుండా పరమ బోరు కొడుతూ ఉంది. నేను పైకి ఏం అనలేదు కానీ మనసులో మాత్రం నా వాళ్ళంతా ఇంత నాస్తికులైపోయారా అనిపించింది. ఇంట్లోనే కాదు మా వీధిలోనే ఏ సందడీ లేదు. అందరికీ రాముడు గురుతులేడుకానీ, శ్రీరామనవమి కదా ఇచ్చిన సెలవుకు ముసుగు తన్ని పడుకోవడం గురుతుంది. నాకు అందరిమీదా కాస్త చిరాకూ, కోపం వరసగా వచ్చేసాయి.

ఇక ఎదురింట్లో అడిగి తెచ్చిన మావిడాకులు గుమ్మానికి అలంకరించి, పడుకున్న ఆయన్ని గుడికి వెళదామని నిద్రలేపాను. షరా మామూలే నేను రాలేను నువ్వు వెళ్ళు అని. అప్పటి వరకూ మేము ఇద్దరం ఒకటి మా అభిప్రాయాలూ ఒకటే అనుకున్న నాకు చుక్కెదురైంది.

అప్పటికే 11గంటలు కావస్తుంది. తలారా స్నానం కానిచ్చి తయారై దేవుడికి దీపారాధన చేసి కొబ్బరికాయ తీసుకుని బయలుదేరాను గుడికి. నేను వెళ్ళే సరికి స్వామివారికి, అమ్మవారికీ కంకణ ధారణ అయింది. అప్పటికి పెద్దగా జనంలేరు.

అదేమిటి 11.30 ముహుర్తం అన్నారుకదా అన్నాను నా పక్కన నుంచున్నఆమెతో “ఎమోనమ్మ చోద్యం ఇప్పుడు 1.30 పైనే అయ్యింది. నేను టీవీలో భద్రాద్రిలో రాములవారి కళ్యాణం చూసే వస్తున్నా, ఇక్కడ చూస్తే ఇంకా కంకణాల దగ్గరే ఉంది”.అంది.

నాకు ఆ మాటలేం వినిపించడం లేదు ఏదో పుణ్యం చేసి వైకుంఠానికి వచ్చానా అక్కడే రాములవారు నా ముందుగా సీతా సమేతంగా కూర్చుని కళ్యాణం చేసుకుంటున్నాడా అన్నట్టు ఊహలో కాసేపు ముగ్దురాలినై చూస్తుండిపోయాను.

చాలా మంది వచ్చారు కళ్యాణం చూడడానికి. మంగళ వాయిద్యాలు మోగుతున్నంత సేపూ నా కళ్ళల్లో చిన్నగా నీటి పొర.

సీతమ్మ రాములోరి పక్కన సిగ్గు పడుతూ తల వంచుకుని క్రీగంట రాముడిని దొంగచూపులు చూస్తున్నది అక్కడి వారు ఆ విషయం గమనించకున్నా, ఆ అరుదైన దృశ్యం నా కళ్ళల్లో పడకపోలేదు. ఎంత చిత్రం ఇన్ని సార్లు పెళ్ళి చేసుకున్నా ఇంకా ఆ బెరుకెందుకు ఇదేమి సరసమమ్మా, అని అడగాలనిపించింది. పెళ్ళి ఘనంగా జరిగింది. ఆ జంటను అలాగే నా మనసులో ముద్ర వేసుకున్నాను.

కళ్యాణం కావస్తూ ఉండగానే అందరిలోనూ ఒకటే కంగారు ఎప్పుడు ఇంటికి పోదామా అని, లేదంటే భోజనాలు తిని బయలు దేరాలని కాబోసు, చిన్న పిల్లలతో వచ్చిన వారి సంగతే చాలా దారుణంగా ఉంది ఒకటే తోపులాట.

నా కళ్లు మాత్రం అవేమి ఆశించడం లేదు. నేను ప్రతీ రామనవమికీ తలంబ్రాల బియ్యం వరకూ ఆగి అవి తీసుకు మరీ వెళతాను. ఈ రోజూ అలాగే అందరితో తోసుకుంటూ కాక కాస్త ఆగి వెళ్ళాను. అక్షింతలు వేసి, తలంబ్రాలు అడిగి తీసుకున్నాను. అప్పటికి ఏదో తృప్తితో కడుపంతా నిండిపోయింది.

కానీ ఏదో వెలితి ఎవరికీ సరిగా పానకం అందలేదు, వడపప్పు అసలు లేనే లేదు. అందరినీ భోజనాలు చేసి మరీ వెళ్ళమన్నారు. నాకు ఆ విషయం ఎందుకో రుచించదు. మనం తినే ఆ భోజనం ఓ బీదవానికి వస్తుందికదా అనే అభిప్రాయం నా మనసులో బలంగా నాటుకు పోయింది.

ఇలా రంగరంగ వైభవంగా భద్రాద్రి కళ్యాణంతో సమానంగా ఇక్కడా రాముడు సీతమ్మ చేయందుకున్నాడు.